సుస్థిర వ్యవసాయం వైపు ప్రయాణం: మొదటి భాగం

B-86-72,  1986 batch BSc (Ag), 1990 Msc (Ag) batch

రెండు తరాలుగా వ్యవసాయం చేయని కుటుంబం నుంచి వచ్చి వ్యవసాయ విద్య నేర్చుకోవటం కోసం బాపట్ల వ్యవసాయ కళాశాల లో 1986 లో B.Sc (Ag)  లో అడ్మిషన్ తీసుకున్నాను. మా నాన్నగారు, తాత గారు కూడా రైల్వే లలో పనిచేసారు. మా అమ్మగారు వ్యవసాయ కుటుంబం నుంచే. అప్పటివరకు నాకు తెలిసిన వ్యవసాయం అమ్మతో మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసినదే.  వ్యవసాయం పై మక్కువ కంటే నిజానికి మెడిసిన్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవటం, ఎంట్రన్స్ ద్వారా సీట్ రావటం వలన చేరటం జరిగింది.  ఇంటర్మీడియట్ రోజుల నుంచి కూడా సివిల్ సర్వీసెస్ పైన ఇంట్రెస్ట్ ఎక్కువ వుండేది.

మొదటి ఎంట్రన్స్ బ్యాచ్

అప్పటి వరకు ఇంటర్మీడియట్ మార్కుల ప్రాతిపాదికన ఇస్తున్న అడ్మిషన్లు, అప్పటికే వున్న ఇంజనీరింగ్,  మెడిసిన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (EMCET) కి అగ్రికల్చర్ కలిపి EAMCET చేశారు. దీనితో అప్పటివరకు ఇంటర్మీడియట్ నుంచి నేరుగా కళాశాల లో చేరుతున్న విద్యార్ధుల స్థానం లో అప్పటికే ఒకటి రెండు సార్లు ఎంట్రన్స్ రాసి లేక వేరే కోర్సులు చేస్తూ/చేసి వచ్చి చేరిన వారి సంఖ్య ఎక్కువైంది. ఒక క్లాసులో చేరే విద్యార్ధుల వయస్సు, అనుభవం సుమారుగా ఒకటే వుండే పరిస్థితి నుంచి చాలా వ్యత్యాసాలు వుండే వారి సమూహంగా మా బ్యాచ్ తయారైంది. మాతో చేరిన వారిలో అప్పటికే డిగ్రీలు, PGలు చేసి మరల B.Sc (Ag) చేరిన వాళ్ళు వున్నారు. దీనితో కళాశాలలో ఒక కొత్త ఒరవడి ప్రారంభమైంది. సీనియర్-జూనియర్ అనే తేడాలు పెద్దగా లేకుండా అందరు త్వరగా కలిసి పోవటం జరిగిపోయింది. అప్పుడప్పుడే ప్రపంచాన్ని, జీవితాన్ని అర్ధం చేసుకుంటున్న నేపధ్యం లో ఇలాంటి బ్యాచ్ లో వుండటం చాలా బలమైన వ్యక్తిత్వం ఏర్పడటానికి చాలా సహకరించింది.

మా బ్యాచ్ తో కళాశాల లో చాలా మార్పులు ప్రారంభం అయ్యాయి. కొన్ని మంచివి అయితే, కొన్ని కాదేమో. మేము కాలేజీ లో చేరే నాటికి లైబ్రరీ సాయంత్రం ఐదు గంటలకి మూసేసే వారు. మేము గొడవ చేసి సాయంత్రం ఎనిమిది వరకు ఉండేలా మార్పు చేయటం జరిగింది. మొదట్లో ఒక్కల్లిద్దరమే వుండే వాళ్ళం కాని నెమ్మదిగా విద్యార్ధులు కూడా అలవాటు పడ్డారు. మేము కాలేజీ లో చేరేనాటికి అగ్రోనోమి ప్రాక్టికల్ కోసం మగపిల్లలకు మాత్రమే ఖాకి నిక్కర్లు వేసుకోవాలని రూల్ వుండేది. అమ్మాయిలు తమ బట్టలు పాడవుతాయని గట్ల మీద నిలబడటమే కాక మిమ్మల్ని చూసి నవ్వుతున్నారన్న ఆరోపణలతో స్ట్రైక్ చేసి మరి అందరికి ఖాకి డ్రెస్ వేసుకునేలా మార్చుకున్నాం.  అలాగే మూడో సంవత్సరం లో వున్నప్పుడు ఉద్యోగాలు కాలేజీ మార్కుల ప్రాతిపాదికన కాకుండా పోటీ పరీక్షల ద్వారా జరపాలని మేము, కాలేజీ మార్కులు, సేనియారిటి  ఆధారంగా ఇవ్వాలని సీనియర్లు గొడవపడి సమ్మె చేసే వరకు వెళ్ళింది.

అప్పటికే బాపట్ల వ్యవసాయ కళాశాల లో అప్రకటిత కుల సంఘాలు ఉండేవి. చిన్నప్పటినుంచి రైల్వే కాలనీ లో పెరగటం, రైల్వే స్కూల్ లో చదువుకోవటం తో ఈ కుల సమస్య గురించి పెద్దగా అవగాహన లేని నాకు, కళాశాల లో కొంత మంది సీనియర్లు, టీచర్లు కూడా కులాల వారిగా విద్యార్ధులను విడదీయటం, కులాల మధ్యలో గొడవలకు ఆద్యం పోయటం చేయటం చాలానే ఇబ్బంది కలిగించేది. అలా కుల వలయం నుంచి బయట బడిన కొందరం కలిసి తిరిగే వాళ్ళం. దానితో చాలా జూనియర్ నుంచి చాలా సీనియర్ల వరకు పరిచయాలు ఏర్పడ్డాయి. అవి ఇప్పటికి కొనసాగటం సంతోషం.

మంచి టీచర్లు

చాలా మంది టీచర్లు చాలా శ్రద్ధతో చెప్పటం బాపట్ల కళాశాల ప్రత్యేకత. అనేక సబ్జెక్టులు బాగా అర్ధం అయ్యేలా చెప్పేవాళ్ళు. ఇక్కడ చదివిన చదువులకి, గ్రామాలలో వాస్తవాలకి ఆ తర్వాత RAWEP (Rural Agricultural Work Experience Program) వాస్తవాలు బేరీజు వేసుకోవటానికి చాలా ఉపయోగ పడింది.   

స్టెన్సిల్ చదువులు

వ్యవసాయ విద్య గురించి మాట్లాడుకునేటప్పుడు ‘స్టెన్సిల్’ గురించి మాట్లాడుకోకుండా వుండటం కష్టం. అప్పటికి ఇంకా ఆధునిక ఫోటో కాపీ మెషిన్ లు రాలేదు. మామూలు టైపు రైటర్ పైన ప్రత్యెక మైన స్టెన్సిల్ పైన కాపీ లు తయారు చేసేవాళ్ళు.  ప్రతి కోర్స్ కి ఒక పుస్తకం వుండేది. అలాగే సీనియర్ ల నుండి జూనియర్ లకి వచ్చేవి. చాలా పుస్తాకాల నుంచి సేకరించి రాయటం తో చాలా మంచి సమాచారం వుండేది. అయితే ఈ స్టెన్సిళ్ళు విద్యార్ధులకు టీచర్లకు ‘వేదాల వంటివి. అందులో ఏమి రాసి వుంటే అవి తూచా తప్పకుండా పరీక్షల్లో రాయవలసి రావటం వుండేది. స్పెల్లింగ్ మిస్టేక్ లు , ప్రింట్ సరిగ్గా అవక పోవటం తో వుండే సమస్యలు, మధ్యలో ఎవరో చేసిన మార్పులు, చేర్పులతో అనేక సార్లు భయంకర మైన తప్పులు దోల్లెవి. కొన్ని సార్లు చాలా నవ్వు తెప్పించే లా వుంటే, కొన్ని సార్లు పరీక్షలు తప్పించేలా ఉండేవి. అయితే వీటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయక పోవటం తో కొన్ని  సబ్జెక్ట్స్, కొన్ని విషయాల్లో మా టీచర్ లు చదువుకున్న వాటినే మేము చుడువు కోవాల్సి వచ్చి వచ్చేది. ఆ విధంగా హరిత విప్లవం వచ్చిన అరవై ళ నాటి విషయాలనే ఎక్కువ చదువుకునే వాళ్ళం. ఆ తర్వాత క్రమం లో వచ్చిన కొత్త ఆవిష్కరణలు, ఆలోచనలు కాని, అప్పటికే హరిత విప్లవం తో వచ్చిన సమస్యలు కాని, ప్రత్యామ్న్యాయ ఆలోచనలకు కాని చోటు దక్కలేదు.

చదువులకు, బయట అనుభవాలకు వ్యత్యాసం

సివిల్ సర్వీసెస్ వైపు వున్న ఉత్సుకత తో జనరల్ నాలెడ్జ్ పైన ఎక్కువ దృష్టి పెట్టె క్రమం లో వ్యవసాయ సమస్యలు కొద్ది కొద్దిగా అర్ధం అయ్యేవి.  1986 లో మొదటి సారి పత్తి పంట పై తెల్ల దోమ ఎక్కువవటం తో విపరీతంగా నష్టపోయి గుంటూరు, ప్రకాశం జిల్లాలలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న వార్తలు వార్తాపత్రిక లలో వచ్చేవి. అయితే కాలేజీ లో వీటిపై ఏ మాత్రం చర్చ జరిగేది కాదు. ఒకసారి క్లాసు లో టీచర్ ని అడిగితే, వాళ్లందరికి మనం చెప్పే కొత్త పద్దతులు తెలియక నష్టపోతున్నారు అన్నారు. ఈ మాటలు నా మీద చాలా ప్రభావం చూపించాయి.  అసలు సమస్య ఏంటో, దానికి ఏమి చేయాలో తెలియక పోయినా ఎదో ఒకటి చేయాలి అనే ఆలోచన ఆతర్వాత ఎప్పుడు వదల లేదు.  అసలు వ్యవసాయాన్ని, రైతుల్ని అర్ధం చేసుకోవటం లో వ్యవసాయ విద్య ఎక్కడో తప్పటడుగు వేస్తోంది అని ఆ తర్వాత క్రమం లో అర్ధం అయింది. అయితే ఆ వివరాలు మరల చెప్పుకుందాం.

కళలు-సాహిత్యం

బాపట్ల కళలకు పుట్టినిల్లు. నాకు అప్పటికే పెయింటింగ్ పైన, క్విజ్, పోయెట్రి లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ వుండగా, ఇక్కడ నాటకాల  వైపు కొంత ఇంట్రెస్ట్ కలిగింది. తోటి విధ్యార్ధులతో కలిసి ఇంటర్ కాలేజియేట్ ఉత్సవాలలో నాటకాలు వేయటం. యూనివర్సిటీ స్థాయిలో అవార్డులు రావటం తో అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలకు కూడా వెళ్ళటం అవార్డ్లు పొందటం జరిగింది. కాలేజీ లో ప్రతి సంవత్సరం ఆర్ట్ ఎక్సిబిషన్ ఏర్పాటు చేయటం కూడా ప్రారంభించం. ఇదే క్రమం లో బాపట్ల పట్టణం లో అనేక మందితో పరిచయాలు జరిగాయి. అందులో ముఖ్యమైనవి ‘జన విజ్ఞాన వేదిక’ తో పరిచయం. ప్రతి విషయాన్ని ఒక సైంటిఫిక్ దృక్పథం తో చూడటం అక్కడే ప్రారంభం ఐంది.

జెనెటిక్స్ మరియు బ్రీడింగ్ నుంచి ఎక్స్టెన్షన్ వైపు

కాలేజీ లో జెనెటిక్స్ మరియు బ్రీడింగ్ సబ్జెక్టు ఒక ప్రత్యెక గుర్తింపు వుండేది. నాకు కూడా చాలా ఇష్టమైన సబ్జెక్టు కావటం ప్రత్యెక శ్రద్ధతో చదివే వాణ్ని.  M.Sc(Ag) కోసం బ్రీడింగ్ లో ICAR జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ కూడా వచ్చింది. అయితే RAWEP సమయం లో వచ్చిన అనుభవాలతో రైతులతో నేరుగా పనిచేసే చదువే చదువుకోవాలని ఎక్స్టెన్షన్ వైపు వెళ్ళటం జరిగింది. విద్యార్ధిగా RAWEP సమయం లో గ్రామాల్లో వుండటం ఎంతగా నచ్చిందంటే ఆ తర్వాత M.Sc(Ag) రీసెర్చ్ అంశం గా RAWEP ప్రభావాల గురించి చేయటం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మొదటగా ప్రారంభించిన పద్దతి ఆ తర్వాత క్రమం లో అనేక విశ్వవిద్యాలయాలు అమలు చేసాయి. చాలా మార్పులు కూడా జరిగాయి.

అయితే M.Sc(Ag) అవగానే PhD కోసం డిల్లీ లోని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (IARI) లో చేరటం కోసం 1992 లో ఎంట్రన్స్ రాసి సీట్ తెచ్చు కోవటం జరిగింది. అయితే నా థెసిస్ రిజెక్ట్ కావటం పెద్ద షాక్ ఇచ్చింది. ఎక్స్టర్నల్ ఎక్షమినెర్ RAWEP గురించి పెద్దగా తెలియక పోవటం తో కొన్ని వివరాలు అడగటం, ఇంట్రడక్షన్ లో కొన్ని మార్పులు సూచించటం తో నా PhD లో చేరికకు బ్రేక్ పడింది. మార్పులు చిన్నవైనా అప్పటికి వున్న రూల్స్ ప్రకారం ఆరు నెలల తర్వాతే సబ్‌మిట్ చేయటానికి అవకాశం ఇవ్వటం జరిగింది. దానితో రెండో సారి 1993 లో మరలా PhD ఎంట్రన్స్ రాసి IARI లో సీట్ తెచ్చుకొని చేరటం జరిగింది.

IARI లో PhD

డిల్లీ లో PhD లో చేరేవరకు కూడా సివిల్ సర్వీసెస్ పైనే ఇంట్రెస్ట్ వుండేది. నా M.Sc(Ag) థెసిస్ విషయం లో జరిగిన గందరగోళం తోను, అప్పటికే చదువులకి, వాస్తవాలకి వున్నా వ్యత్యాసాలు అర్ధం అవుతున్న నేపధ్యం లో అసలు వ్యక్తులు, సంస్థలు ఎ విషయం లో నైనా నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అనే అంశం పైన ఇంట్రెస్ట్ పెరిగింది. అదే అంశంగా IARI లో విద్య గురించి, పరిశోధనల గురించి సరైన నిర్ణయాలు జరగాలి అనుకుంటే ఎలాంటి వ్యవస్థలు వుండాలి అని PhD లో రీసెర్చ్ టాపిక్ ‘Design of Management Information System for Postgraduate teaching and Research programmes at Indian Agricultural Research Institute’  తీసుకోవటం జరిగింది.  ఈ రీసెర్చ్ చేస్తున్న క్రమం లోను, IARI లోను, డిల్లీ లోను ఏర్పడ్డ కొత్త పరిచయాలు అనేక కొత్త విషయాలు నేర్చుకోవటం కోసం అలాగే విశాల మైన దృక్పథం పెంపొందించు కోవటం లోను తోడ్పడ్డాయి.  

సివిల్ సర్వీసెస్ కోసం చదివే క్రమం లో భారతీయ ఆర్ధిక వ్యవస్థ గురించి, విధానాలు, లోపాలు అర్ధం చేసుకోవటం జరిగింది. అలాగే 1995 లో భారత దేశం ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరటం, రైతు సంఘాల ఆందోళనలు ఒక వైపు, కాలేజీ లో అంతా అద్భుతమే అనే చర్చలు చూడటం జరిగేది. అప్పుడే అందరికి కొంచెం అర్ధం అయ్యేలా విషయాలు చెప్పాలనే ప్రయత్నం లో భాగం గా ‘shabd’ అనే గోడ పత్రిక ను ఒక మిత్రుడితో కలిసి ప్రరంబించటం జరిగింది. వారం వారం రాసి నోటిస్ బోర్డు లో పెట్టేవాళ్ళం. కొత్త విషయాలు, కొత్త దృక్పథం తో రాయటం తో ఇవి చదవటానికి చాలా మంది ఎదురు చూసేవాళ్ళు.

మూడో సంవత్సరం లో వుండగా అటు సివిల్ సర్వీసెస్ లో ‘Indian Revenue Service’ కి ఎంపిక కావటం, ఇటు ‘Agricultural Research Service’ కు ఎంపిక కావటం జరిగింది. అనేక తర్జన బర్జన తర్వాత హైదరాబాద్ లో నూనె గింజల పరిశోధన స్థానం లో శాస్త్రవేత్తగా చేరటం జరిగింది.

వ్యవసాయ శాస్త్రవేత్త గా

1996 లో నూనె గింజల పరిశోధన స్థానం లో విస్తరణ విభాగం లో చేరి గ్రామాల్లో ఆధునిక పద్దతుల గురించి క్షేత్ర ప్రదర్శనలు చేసే ప్రాజెక్ట్ లీడర్ గా భారత దేశం అంతా తిరిగే అవకాశం రావటం తో పాటు, సంస్థలలో నిర్ణయాలు ఎలా జరుగుతాయి అనే విషయాలు అర్ధం కావటం జరుగుతోంది.  అదే సమయం లో రైతులతోను, రైతు సంఘాల తో, స్వచ్చంద సంస్థలతో కలిసి పనిచేసే వాణ్ని.

1997 లో మరలా పత్తి పంట నాశనం కావటం తో వరంగల్, కరీంనగర్ జిల్లాలలో అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతు కుటుంబాలతోను, మిగిలిన రైతులతోను కలిసి సమస్య ను కొంచెం వివరంగా రాద్దామనే ఉద్దేశం తో మిత్రులతో కలిసి ఒక స్టడీ  టీం గా ఏర్పడి ‘వ్యవసాయ సంక్షోభం-పత్తి విషాధ కథ’ పేరుతో ఒక రిపోర్ట్ విడుదల చేయటం జరిగింది. దీనిని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించారు.  ఇందులో మొదటి సారి వ్యవసాయ పద్దతులు, విధానాలతో వున్న సమస్యల గురించి వివరంగా చర్చించటం జరిగింది.

అలాగే 1998 లో రహస్యంగా బిటి పత్తి మీద క్షేత్ర పరీక్షలు జరుగుతుంటే చూసిన కొంత మంది రైతు సంఘాలతో కలిసి పూర్తీ వివరాలతో ఒక రిపోర్ట్ చేయటం జరిగింది.  

వ్యవసాయ శాస్త్రవేత్త గా ICAR లో పనిచేస్తున్న సమయం లో ప్రత్యామ్న్యాయ వ్యవసాయ పద్దతుల గురించి, ప్రపంచ వ్యాప్తం వున్న అనుభవాలు, ఆలోచనలు తెలుసుకోవటం కోసం చాలా ప్రయత్నాలు చేయటం జరిగింది. దేశవ్యాప్తం గా ఇలాంటి విషయాల పైన పనిచేస్తున్న రైతులు, రైతు సంస్థలను కలవటం అప్పటికే సంక్షోభం లో కూరుకు పోతున్న వ్యవసాయ రంగాన్ని సుస్థిరత వైపు మళ్లించాలంటే ఏమి చేయాలి అనే విషయం పైన చర్చలు చేయటం చేస్తున్న క్రమంలో అర్ధం ఐన ఒక ముఖ్య మైన అంశం -నూతన ఆవిష్కరణలు కేవలం పరిశోధనా సంస్థల లోను, అక్కడి లాబరేటరీలలో  నుండి మాత్రమే వచ్చేవి కావు. ప్రజలు తమ దైనందిన జీవితం లో, తమ తమ రంగాల్లో ఎదుర్కునే సమస్యలకు పరిష్కారాలు వెతుక్కునే ప్రయత్నం ఎప్పుడు చేస్తుంటారు. గుర్తింపు, ప్రోత్సాహం లేక పోవటం వలన చాలా సందర్బాలలో అలాంటి ఆవిష్కరణలు పెద్ద స్థాయి లోకి వెళ్ళవు.

ఈ నేపధ్యం లో ఆధునిక వ్యవసాయ పద్దతుల పేరుతో వస్తున్న టెక్నాలజీ లను కాని, స్థానిక ఆవిష్కరణల పేరుతో వస్తున్నా ప్రత్యామ్న్యాయ పద్దతులను కాని ఒక సైంటిఫిక్ దృక్పథం తో అర్ధం చేసుకొని పని చేసే సంస్థ ఒకటి ఏర్పాటు చేయాలి అని కొంత మంది మిత్రులతో కలిసి నిర్ణయించుకోవటం జరిగింది.  కాని అప్పటికే పాతుకొని పోయిన ఆలోచనలు, మార్పు కు అడ్డుపడే సంస్థాగత వ్యతిరేకతలు దృష్టిలో పెట్టుకొని ఈ సంస్థను ఎవరైనా సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త సారధ్యం లో ఏర్పాటు చేయాలనీ ప్రయత్నం చేసాం. అప్పటికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న Dr MS చారి గారు, స్వచ్చంద సంస్థలైన Centre for World Solidarity శాస్త్రి గారు, Deccan Development Society సతీష్ గారు, మిత్రులు WASSAN సంస్థ రవీంద్ర లతో తరచూ చర్చలు జరిగేవి.  Science for People  పేరుతో చిన్న ప్రయత్నం గా కొన్ని పుస్తకాలు తేవటం, అప్పటికే ఇంగ్లీష్ లోను, ఇతర భాష లలో ప్రజల ఆవిష్కరణలకు వేదికగా ప్రాముఖ్యత సంపాదించుకున్న అనిల్ గుప్తా గారి Honey bee పత్రిక ను  తెలుగులో ‘తేనెటీగ’ పేరుతో తేవటం జరిగింది. ప్రొఫ్. గీర్వాణి గారెతో కలిసి ఈ విషయం పైన పనిచేయటం జరిగింది.

ICAR నుంచి CSA వైపు

1997-98 లో వరంగల్, కరీంనగర్ ప్రాంతాలలో జరిగిన రైతు ఆత్మహత్యల తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కొన్ని చర్యలు చేపట్టటం జరిగింది. అయితే ఈ ప్రయత్నాలు అన్ని కూడా వ్యవసాయం లో దిగుబడి పెంచటం కోసం కొత్త టెక్నాలజీ లు, ప్రపంచ మార్కెట్ తో అనుసంధానం చేయటం కోసం విధానాలలో మార్పు కోసం చేసినవే. ఇదే సమయం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం Vision 2020 పేరుతో ఒక విధాన పత్రం విడుదల చేసింది.  స్థానిక పరిస్థితులను గుర్తించకుండా, విదేశీ కన్సల్టెంట్స్ ద్వారా రూపొందించబడ్డ ఈ విధాన పత్రం ఇటు ప్రజల వైపు నుంచి, అటు రైతు సంఘాల వైపు నుంచి కూడా చాలా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది. చిన్న కమతాలు ఎక్కువగా వున్నా దేశం లో వ్యవసాయ పద్దతులు ఎలా వుండాలి, పర్యావరణ సమస్యలు ఎక్కువవుతున్న నేపధ్యం లో ప్రత్యామ్నాయాల పై ఆలోచన ఎలా చేయాలి అన్నది ఆలోచన చేయకుండా ఆధునిక సాంకేతికాలు అవలంబించలేక పోవటానికి చిన్న కమతాలు సమస్య కాబట్టి వీరికి ప్రత్యామ్న్యాయ ఉపాధి అవకాశాలు చూపించి వ్యవసాయం పై ఆధారపడిన వారి సంఖ్య సగానికి పైగా తగ్గించాలని ఈ పత్రంలో తమ ఆలోచనగా ప్రభుత్వం పేర్కొంది.  ఈ విధానాలు అమలు చేయటానికి చేసిన ప్రయత్నాలు వ్యతిరేకత ను ఎదుర్కోవటమే కాకుండా రైతులపై తీవ్రమైన ప్రభావం చూపాయి.   2004వ సంవత్సరం  లో  రైతు ఆత్మహత్యలు 4,౦౦౦ పైగా జరిగాయి. నా నేపధ్యం లో ICAR లో అప్పటివరకు చేస్తున్న ఉద్యోగం మానేసి Centre for Sustainable Agriculture (CSA) అనే సంస్థను ఏర్పాటు చేయటం జరిగింది. అప్పటికే రసాయనిక పురుగు మందులు వాడకుండా స్థానికంగా దొరికే పంట, పశు వ్యర్ధలతో తాయారు చేసుకునే కషాయలతో  Dr. చారి గారు చేసిన ప్రయత్నాలను పెద్ద స్థాయి లోకి తీసుకు వెళ్ళటం మొదటి ప్రయత్నం గా ఎంచుకోవటం జరిగింది. Non Pesticidal Management (NPM) గా పిలవబడే ఈ పద్దతులు అప్పటిలో ఒక సంచలనం సృష్టించాయి.

పురుగు మందులు లేక పోతే పురుగులు లేవు (No pesticides, No pests)

 ఖమ్మం జిల్లా పునుకుల గ్రామం పూర్తిగా పురుగు మందులు మానేసిన తర్వాత అందరు భయపెట్టినట్టుగా పురుగుల సమస్య పెరగక పోగా బాగా తగ్గింది. ప్రకృతి లో వుండే సమతుల్యత ఎలా పనిచేస్తుందో స్వయంగా చూసి తెలుసుకోవటానికి, నేర్చుకోవటానికి ఈ గ్రామం మార్గాలు వేసింది. అప్పటి వ్యవసాయ మంత్రి ఈ గ్రామాన్ని విలేఖరులు, శాస్త్రవేత్తలతో కలిసి సందర్శించటం, ఈ పద్దతులను అన్ని గ్రామాలకు తీసుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తామని చేసిన వాగ్దానాలు వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారం లేక పోవటం తో ముందుకు వెళ్ళలేదు. అయితే అప్పుడు మహిళా సంఘాలతో కలిసి పనిచేసే ఇందిరా క్రాంతి పధం (SERP-Society for Elimination of Rural Poverty) తో కలిసి అనేక గ్రామాలకు తీసుకు వెళ్ళటం జరిగింది. అప్పటి CEO శ్రీ విజయ్ కుమార్ గారు ఆ తర్వాత కేంద్ర స్థాయి లో గ్రామీణ అభివృద్ధి శాఖ కు సెక్రటరీ గా వున్నా, తెలంగాణా విడిపోయిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గా వున్నా, రిటైర్ ఐన తర్వాత కూడా ఇదే పంధా లో వ్యవసాయ ప్రత్యామ్నాయాల పై పనిచేస్తున్నారు.

సత్యమేవ జయతే

పురుగు మందులు వాడకుండా పండించే పద్దతుల గురించి అప్పటికే అనేక దేశీయ/పత్రికలు, టి.వి. చానల్స్ కథనాలు రాసినా, అనేక విశ్వవిద్యాలయాల విద్యార్ధులు పరిశోధన పత్రాలు ప్రచురించినా రాని గుర్తింపు ఒక్క టివి షో ద్వారా వచ్చింది. అదే ప్రముఖ నటుడు ‘ఆమిర్ ఖాన్’ వ్యాఖ్యాత గా వ్యవహరిస్తూ నిర్మించిన ‘సత్యమేవ జయతే’.  2012 లో ‘టాక్సిక్ ఫుడ్’ పేరుతో హిందీ లోను ఇతర భారతీయ భాషలలోను వచ్చిన ఈ షో దేశ వ్యాప్తం గా కోట్ల మంది ప్రజలు చూసారు, ఇంకా చూస్తూనే వున్నారు. అప్పటి వరకు పాలసీ చర్చా వేదికలకు పరిమితమైన పురుగుమందుల చర్చ ప్రతి కుటుంబానికి చేరింది.  ఆ తర్వాత చాలా రాష్ట్రాలు, రైతులు, వినియోగ దారులు ఈ పద్దతుల వైపు మళ్లారు.

ఏనబవి -సేంద్రియ గ్రామం

ఏనబావి -తెలంగాణా లోని జనగామ జిల్లా (పాత వరంగల్ జిల్లా) లో ఒక చిన్న గ్రామం.  గ్రామంలోని రైతులందరూ రాసాయనిక ఎరువులు, పురుగు మందులు, జన్యుమార్పిడి పంటలు వేయం అని, సేంద్రియం వైపు మల్లుతామని 2005 తీర్మానం చేసి తమ గ్రామాన్ని సేంద్రియ గ్రామంగా ప్రకటించారు. ఆది ఈ నాటికి కూడా రైతులని, పాత్రికేయులని విధ్యర్డులని ఆకర్షిస్తూనే వున్నది.

సేంద్రియ వ్యవసాయం సాధ్యమా, ప్రకృతి వ్యవసాయం గొప్పదా, రసాయనిక వ్యవసాయం లేక పోతే ఆహార భద్రతకు ముప్పు వస్తుందా అనే అపోహలు, ఎడతెగని వాదనల మధ్య ఈ గ్ర్రామాన్ని సందర్శించి ప్రేరణ పొంది మారుతున్న రైతులు వున్నారు.

సహజ ఆహారం

సేంద్రియం గా మారిన రైతులకు మార్కెట్ అవకాశాలు కల్పించటం కోసం రైతులని సహకార సంఘాలుగా ఏర్పాటు చేసి, వాటిని నేరుగా వినియోగదారులకు అందించే ప్రయత్నం 2014 లో ప్రారంభించటం జరిగింది. సేంద్రియంగా మరీనా 23 సహకార సంఘాల సమాఖ్య గా సహజ ఆహారం ఉత్పత్తి దారుల సంఘం ఏర్పాటు చేసాము.  హైదరాబాద్, విశాకపట్నం లో సొంత స్టోర్ల ద్వారా ఈ ఆహార ఉత్పత్తులను అమ్మటం జరుగుతోంది. నాలుగు ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ కోసం యూనిట్స్ కూడా ఏర్పాటు చేసి అక్కడి నుంచి నేరుగా సప్లై చేయటం జరుగుతోంది.

సమస్యలను అర్ధం అయ్యేలా చెప్పటానికి, సాధ్యమయ్యే పరిష్కారాల గురించి  చెప్పటానికి,  చేస్తున్న ప్రయత్నాలు అందరికి తెలియచేయటం కోసం అనేక వేదికలు వాడుకుంటూ వున్నాం. ఇప్పటికి నాలుగు TEDX talks ఇవ్వటం జరిగింది.  2018 లో ‘మిట్టి -బ్యాక్ తో రూట్స్’ పేరుతో ఒక పూర్తి హిందీ సినిమా రూపొందించాం. ఇది తెలుగులో కూడా అనువదించ బడింది.

సహజ ఆహారం అనుభవం తో అనేక ప్రభుత్వ సంస్థ లతో కలిసి 200 పైగా సహకార సంఘాలు ఏర్పాటు చేయటం, సహకారం అందివ్వటం చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ప్రత్యామ్యాయ వ్యవసాయ పద్దతులు, గ్రామీణ జీవనోపాధుల పై శిక్షణలు ఇవ్వటం కోసం ‘గ్రామీణ అకాడమి పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నాం.

ఈ మొత్తం ప్రయాణం లో నేను నేర్చుకున్న ముఖ్య మైన పాఠలు

  • వ్యవసాయ విద్యార్ధులుగా వున్న అనేక అవకాశాలను అర్ధం చేసుకొని మన ప్రయాణం ఏమిటి అన్నది స్పష్టంగా ఆలోచించుకోవాలి.
  • అపరిమిత మైన అవకాశాలు వున్నాయి, అందిపుచ్చుకునే ప్రయత్నం మనమే చేయాలి
  • దేశం లో రైతులు తీవ్రమైన సంక్షోభం లో వున్నారు. వాతావరణం లో వస్తున్న మార్పులు, కొత్తగా వస్తున్న జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ విధానాలలో మార్పులు ఈ సంక్షోభాన్ని ఇంకా తీవ్రతరం చేస్తున్నాయి. ఇందుకు మనవంతు ప్రయత్నం చేయాలి.

మా ప్రయత్నాలకి అనేక అవార్డులు, రివార్డులు లభించాయి. 2019 లోనే మూడు జీవన సాఫల్య పురస్కారాలు అందుకున్నాను. అలా CSA కి అనేక అవార్డ్లు వచ్చాయి. అందులో చాలా ముఖ్యమైన వి 2014 లో బిహార్, మహారాష్ట్ర రాష్ట్రాలలో ఉత్తమ గ్రామీణ ఆవిష్కరణల అవార్డులు, మరియు సాక్షి,  టీవీ9 అవార్డులు.   

ఈ ప్రయాణం లో నా జీవన సహచరి డా. రాధ రాణి పాత్ర చాల ముఖ్యమైనది.  బాపట్ల కళాశాల లోనే మాకు పరిచయం అయింది. ప్రతి అడుగులోనూ తను అందించే ఆలోచన, సహకారం లేకుంటే ఈ ప్రయాణం సాధ్యం అయ్యేది కాదు. తను ఇప్పుడు డా. YSR హార్టికల్చర్ విశ్వవిద్యాలయం లో ప్రొఫెసర్ గా చేస్తోంది. అలాగే మా అబ్బాయి ఆకాష్ ఇంకా చదువు కొంటున్నాడు.

అలాగే మా ఈ ప్రయాణం లో మాతో కలిసి ప్రయాణం చేస్తున్న రైతులు ముఖ్యమైన వారు. మా మీద నమ్మకంతో మాతో కలిసి ప్రయోగాలు చేయటానికి సిద్దపడ్డారు. వీరందరికీ కృతజ్ఞతలు.

ఈ సుదీర్ఘ ప్రయాణానికి నాంది వేసిన బాపట్ల కళాశాల ఈ రోజు 75 వసంతాలు పూర్తి చేసుకుంటుంది అంటే ఎంతో సంతోషంగా వుంది. దేశానికి, ప్రపంచానికి దిశా నిర్దేశం చేసే అనేక ఆలోచనలు ఇక్కడ ఇంకా పుట్టాలని కోరుకుంటూ…. 

మాతో కలిసి ప్రయాణం చేయటానికి, లేక ఎలాంటి సహాయం, సహకారం కావాలన్నా సంప్రదించండి

డా. జీవి. రామాంజనేయులు

9000699702

ramoo@csa-india.org

www.ramoo.in