శిఖర సమానుడైన శాస్త్రవేత్త డా. ఎం. ఎస్‌. స్వామినాథన్‌ 

భారతదేశ వ్యవసాయ రంగాన్ని తలుచుకోగానే స్ఫురించే మొదటిపేరు డాక్టర్‌ ఎం.ఎస్‌. స్వామినాథన్‌. వ్యవసాయంలో ఆధునిక విధానాలను ప్రవేశ పెట్టడం ద్వారా ఆహార భద్రతను పెంచి దేశానికి ఆయన హరిత విప్లవ పితామహులయ్యారు. ‘ఓడ నుంచి నోటికి’ అన్నట్టుగా ఉన్న కరువు పరిస్థితుల నుంచి, దేశాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి వెలగట్టలేనిది.

అందుకు అనుగుణంగా ఎన్నో సంస్థల ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు. రైతుల జీవితాలను మెరుగు పరచడానికి చివరిదాకా పనిచేస్తూనే ఉన్నారు. అదే సమయంలో హరిత విప్లవ అనంతర దుష్ఫలితాలకు కూడా ఆయన బాధ్యత వహించాలన్న విమర్శలూ వచ్చాయి. ఏమైనా ఆయన లేకుండా భారతదేశ వ్యవసాయ రంగ మంచిచెడ్డలు లేవు.

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డా. ఎం.ఎస్‌. స్వామినాథన్‌ గారు 98 సంవత్సరాల సంపూర్ణ జీవితం గడిపిన తర్వాత ఈ రోజు (సెప్టెంబర్‌ 28) చని పోయారు. భారత వ్యవసాయ రంగంలో అనేక కీలకమైన మలుపుల వెనుక అయన నిర్ణయాలు, ఆలోచనలు ఉన్నాయి. హరిత విప్లవం పేరుతో అధిక దిగుబడినిచ్చే వంగడాలు, రసాయనాలు, నీరు, మెషీన్లు వాడటం వంటివి తేవటంతో పాటు, వీటికి సహకారం అందించటానికి జాతీయ స్థాయిలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, విస్తరణ వ్యవస్థ, రుణాలు అందించటానికి బ్యాంకుల జాతీయీకరణ, మద్దతు ధరలు, సేకరణ కోసం భారతీయ ఆహార సంస్థ, ఆహార భద్రత కోసం జాతీయ పంపిణీ వ్యవస్థ లాంటివి ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషించారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్‌ జనరల్, అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ డైరెక్టర్‌ వరకు అనేక కీలకమైన పదవులు కూడా అయన నిర్వహించారు. 

రైతుల హక్కుల కోసం…
తర్వాతి కాలంలో జాతీయ రైతు కమిషన్‌ చైర్‌ పర్సన్‌గా – భారత వ్యవసాయ రంగం అభివృద్ధిని ఎంత దిగుబడులు పెంచాము అని కాకుండా, రైతుల ఆదాయం ఎంత పెంచాము అని ఆలోచించాలి అనీ, రైతులకు వచ్చే ధరలు ఉత్పత్తి ఖర్చులపై కనీసం యాభై శాతం ఉండాలి అనీ పేర్కొన్నారు. పార్లమెంట్‌ సభ్యులుగా ఉన్న సమయంలో వ్యవసాయ రంగంలో మహిళల ప్రాధాన్యం గుర్తించి, దానికి అనుగుణంగా విధానాలు ఉండాలి అని మహిళా రైతుల హక్కుల చట్టం ముసాయిదా తయారు చేసి పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు.

గ్రామాల్లోని ప్రజలు సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు వచ్చినప్పుడే వ్యవసాయంలో మార్పులు వస్తాయన్న ఆలోచనతో గ్రామాల్లో క్లైమేట్‌ స్కూల్స్‌ లాంటివి స్థాపించడం జరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో వాతావరణంలో వస్తున్న మార్పుల ప్రభావం వ్యవసాయ రంగం మీద ఎలా ఉంటుంది, ఆ మార్పులను ఎదుర్కోవడానికి రైతులు ఏం చేయాల్సి ఉంటుంది, ప్రభుత్వ విధా నాలు ఎలా మారాల్సి ఉంటుంది అనే అంశాలపై పరిశోధన చేయడమే గాకుండా ఆ దిశగా ప్రభుత్వాలపై ఒత్తిడి తేగలిగారు.

అయితే, వ్యవసాయ రంగంలో ఉన్న విభిన్న పరిస్థితులు, విభిన్న అవసరాలు, విభిన్న దృక్కోణాల మధ్యలో నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎదురయ్యే అనేక వివాదాలు కూడా అయన చుట్టూ ఉన్నాయి. హరిత విప్లవం ద్వారా వచ్చిన దుష్ఫలితాలకు ఆయనే భాద్యులు అనీ, జాతీయ జీవ వైవిధ్యం కోల్పోవటం, విదేశాలకు తరలి పోవటంలో అయన పాత్ర ఉందనీ, అనేక ఆరోపణలు ఉన్నాయి.

కానీ అయన జీవన ప్రయాణాన్ని దగ్గరగా చూసిన వాళ్ళు కాని, ఆయనతో ఒక్కసారి మాట్లాడిన వాళ్ళు కాని చెప్పే అనుభవాలు పూర్తిగా వేరుగా ఉంటాయి. తను కలిసిన ప్రతి వ్యక్తినీ పేరుతో గుర్తు పెట్టుకొని పలకరించే అలవాటు ఆయనకు ఉండేది. జాతీయ పరి శోధనా సంస్థలో ఆయన పని చేసినప్పుడు పొలంలో పనిచేసిన కూలీ లను… ఆ తర్వాత ఆయన జాతీయ పరిశోధనా మండలి డైరెక్టర్‌ జనరల్‌ అయినప్పుడు కూడా పేరుతో పలకరించేవాడని చెప్పేవారు.  

నేను భారతీయ పరిశోధనా సంస్థలో పీహెచ్డీ చేస్తున్న సమయంలో ఒక విద్యార్థి తన పరిశోధనా పత్రం కోసం ఆయనని ఇంటర్వ్యూ చేస్తూ – ‘నాయకత్వ లక్షణాలు ఎలా వుండాలి?’ అని అడిగితే, ‘ఎట్టి పరిస్థితులలో నైనా కోపం తెచ్చుకోకుండా ఉండటమే నాయకత్వ లక్షణం’ అని చెప్పారు. 2005లో జాతీయ నాలెడ్జ్‌ కమిషన్‌ ఉప కమిటిలో సభ్యునిగా ఆయనని కలవటం, చర్చించటం… ఆ తర్వాతి కాలంలో మేము సుస్థిర వ్యవసాయంపై చేసిన ప్రయోగాలు, ఫలితాలు, రైతులకు ఆదాయ భద్రత కల్పించాలి అనే విషయం మీద చేసిన సూచనల విషయంలోనూ అయన స్పందించి, తన ఆలోచనలు పంచుకోవటమే కాకుండా, వాటి గురించి రాసి సహకరించారు. 

విధానాలను మార్చేలా…
జీవవైవిధ్యాన్ని కాపాడటం కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చేసిన ప్రయత్నాల వెనుక స్వామినాథన్‌ ప్రయత్నాలు ఉన్నాయి. జీవవైవిధ్య చట్టం, బయోడైవర్సిటీ ఇంటర్నేషనల్, నేషనల్‌ బయోడైవర్సిటీ అథారిటీ స్థాపనలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. మన హైదరాబాద్‌లోని ఇక్రిశాట్‌ సంస్థ ఏర్పాటు కూడా ఆయన ప్రయత్నాలతో జరిగినదే. 

భారత దేశంలో ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయాల మేరకు మేధా సంపత్తి హక్కుల గురించి చర్చలు జరిగి చట్టం చేసినప్పుడు,అందులో రైతులకు హక్కులు ఉండాలని పోరాడి, వాటిని కూడా చట్టంలోకి చేర్చేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో రైతులు కాపాడుతూ వస్తున్న జీవ వైవిధ్యాన్ని డాక్యుమెంట్‌ చేసి, దానికి చట్టబద్ధమైన హక్కులు కల్పించే దిశగా తన స్వామినాథన్‌ ఫౌండేషన్‌ ద్వారా కృషి చేశారు. 

వ్యవసాయ సమస్యలపై, పరిష్కారాలపై ఆయన మాట్లాడినంత, రాసినంత ఏ ఇతర వ్యవసాయ శాస్త్రవేత్త కూడా ఈ రోజు వరకు  చేయలేదు. ప్రభుత్వాలు చెప్పిందే చేయటం కాకుండా, ప్రభుత్వాలు ఏమి చేయాలో చెప్పి వారి చేత ఒప్పించి అనేక మార్పులు చేయటం అయన చేయగలిగారు. 1972లో జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్‌ జనరల్‌గా నియమించబడిన ఆయన, 1979లో ప్రిన్సిపాల్‌ సెక్రటరీగా కూడా నియమించబడ్డారు. బహుశా అలాంటి గుర్తింపు పొందిన ఏకైక శాస్త్రవేత్త డా‘‘ స్వామినాథన్‌.

ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌కి ఎంపిక అయినా, వ్యవసాయ సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ రంగంలోకి రావటమే కాకుండా, జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక సంస్థలను స్థాపించారు. సొంతంగా ఎం.ఎస్‌. స్వామినాథన్‌ ఫౌండేషన్‌ స్థాపించి అనేక కార్యక్రమాలు చేపట్టారు. తన సొంత ఆస్తిలో చాలా భాగం భూదాన ఉద్యమంలో ఇచ్చివేసిన మనిషి కూడా. ఆయన జీవితం ఎందరికో ప్రేరణ, స్ఫూర్తి. రైతుల తరఫున, వ్యవసాయ విద్యార్థులు, శాస్త్రవేత్తల తరఫునా ఆయనకు ఘన నివాళి.
డా‘‘ జి.వి.రామాంజనేయులు 
వ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త, కృష్ణ సుధా అకాడమీ ఫర్‌ ఆగ్రో ఎకాలజీ, సుస్థిర వ్యవసాయ కేంద్రం