(ఆంధ్రజ్యోతి, హైదరాబాద్ సిటీ )
ఆంధ్రజ్యోతి: అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు వల్ల ఏమైనా ప్రయోజనముందంటారా?
జీవీ రామాంజనేయులు: అభివృద్ధి చెందిన దేశాల్లో జీవ వైవిధ్యం పెద్దగా కనిపించదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని వాణిజ్య అవసరాల కోసం వాడుకుంటుండటంతో ముప్పు వాటిల్లుతోంది. ఈ ప్రమాదం నుంచి బయటపడే ఉద్దేశ్యంతోనే దాదాపు 193 దేశాలు కలిసి జీవ వైవిధ్య సదస్సును నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో జరుగుతున్న సీఓపీ-11లో కార్టెజెనా బయోసేఫ్టీ ప్రొటోకాల్ గురించి చర్చ జరిగింది. జన్యు మార్పిడి పంటల వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలను గురించి చర్చించిన సదస్సు సామాజిక, ఆర్థిక విషయాలను దృష్టిలో పెట్టుకోవాలని అభిప్రాయపడింది. ఈ పంటల వల్ల జీవ భద్రతకు నష్టం వాటిల్లుతుందని ఒప్పుకుంటే దానికి ఎవరు జవాబుదారీతనం వహించాలనేది ప్రశ్న. ఒకవేళ విత్తనాలను ఎగుమతి చేస్తే అక్కడ నష్టానికి ఎవరిని బాధ్యులను చేయాలనే సమస్య. ప్రస్తుతం బయో డైవర్సిటీ ఆతిథ్య దేశమైన భారతదేశం వచ్చే రెండేళ్లు అధ్యక్ష పదవిలో ఉండనుంది. అంటే ఇక్కడ జరిగిన నిర్ణయాల అమలు పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. బయో డైవర్సిటీ సదస్సు మూలంగా పెద్దగా ప్రయోజనాలేవీ ఉండే అవకాశం లేదు.
ఆంధ్రజ్యోతి: గతంలో జరిగిన నిర్ణయాలేవైనా అమలు జరిగాయా?
జీవీ: 2010 సీఓపీ జపాన్‌లో జరిగింది. అక్కడ జరిగిన కొన్ని నిర్ణయాలు ఇప్పుడిప్పుడే ఆచరణలోకి వస్తున్నాయి. జన్యుమార్పిడి పంటల విషయంలో ఆర్థిక విషయాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలనేది గతంలో జరిగిన నిర్ణయమే. వాటిని ప్రస్తుతం సీరియస్‌గా అందరూ అంగీకరిస్తున్నారు. ఎక్సెస్ బెనిఫిట్ షేర్ గురించి చర్చ జరిగింది. వాణిజ్యం కోసం జీవ వైవిధ్యాన్ని వాడుకుంటే అప్పటి వరకు వాటిని కాపాడిన వారికి ఎలాంటి ప్రతిఫలం అందించాలనే అంశంపై కూడా ఈ సదస్సులో చర్చ జరిగింది.
ఆంధ్రజ్యోతి: సీఓపీలో జరిగే నిర్ణయాలు అమలు చేయడంలో స్థానిక చట్టాలు అంగీకరించకపోతే?
జీవీ: ఎక్కడ ఏ నిర్ణయం జరిగినా స్థానిక ప్రజల భాగస్వామ్యంతో జరగాలి. ప్రజలకు నిర్ణయాధికారం కావాలి. గ్రామస్థాయిలో బయో డైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలు ఉండాలి. అవేవీ లేకుండా, ఎవరితో చర్చించకుండా,ప్రజల భాగస్వామ్యం లేకుండా నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రస్తుతం జీవ వైవిధ్య సదస్సు అలాగే నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఒప్పందాలైనా ప్రజలదే నిర్ణయాధికారం కావాలి. కేంద్రం, శాస్త్రవేత్తలది కాదు. దేశంలో బీటీ వంగ విషయంలో మాత్రమే ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించింది. ఇక అన్ని విషయాల్లో ప్రజల అభిప్రాయాలతో సంబంధంలేకుండానే నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో జన్యుమార్పిడిపై జరుగుతున్న ఫీల్డ్ ట్రాయిల్స్ ఇందుకు ఉదాహరణ. అందుకే ఈ సదస్సును వ్యతిరేకిస్తూ ‘పీపుల్స్ బయో డైవర్సిటీ ఫెస్టివల్’ను నిర్వహిస్తున్నాం.
ఆంధ్రజ్యోతి: జీవ వైవిధ్య నష్టానికి కారణాలేంటి?
జీవీ: జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడమంటే సమస్యకు మూలాల్ని వెతకడం. బయో డైవర్సిటీ సదస్సు సందర్భంగా పిచ్చుకలు, రాబందులు అంతరించిపోతున్నాయంటూ భారీ హోర్డింగులు పెట్టారు. కారణమేంటో చెప్పలేదు. అందుకు ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలే కారణం. జన్యు మార్పిడి విత్తనాలు, క్రిమి సంహారక మందులు, సెల్‌ఫోన్ టవర్లు పక్షుల మనగడను ప్రశ్నార్థకంగా మార్చాయి. వైవిధ్యాన్ని రక్షించే పంటల్ని ప్రోత్సహించాల్సింది పోయి… అనువుగానివి వేసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, అడవుల్ని విధ్వంసం చేసి మైనింగ్‌లకు అనుమతిస్తున్నారు. సోంపేట లాంటి ప్రాంతాల్లో బీల భూముల్ని కాపాడాల్సిన ప్రభుత్వాలే… పవర్ ప్లాంట్ల పేరిట ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నాయి. ఇలాంటి ప్రాజెక్టుల మూలంగా జీవ భద్రతకు ముప్పు వాటిల్లుతోంది.
ఆంధ్రజ్యోతి: జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి ఏం చేయాలి?
జీవి: జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి దీర్ఘకాలిక కార్యక్రమాన్ని చేపట్టాలి. వైవిధ్య పంటల్ని ప్రోత్సహించాలి. రైతులకు ఆర్థిక భద్రత కల్పించాలి. పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి నష్టం చేకూర్చే ప్రాజెక్టులను నిలిపివేయాలి. పర్యావరణాన్ని కాపాడే పరిశోధనలను ప్రోత్సహించాలి. అప్పుడే జీవవైవిధ్యాన్ని గుర్తించినవాళ్లమవుతాం. ప్రజలు సైతం జీవవైవిధ్యాన్ని కాపాడడం తమ బాధ్యతగా స్వీకరించాలి.
Recent Comments