దిగుబడులకు బీటీ దెబ్బ

http://www.andhrajyothy.com/EditorialShow.asp?qry=2012/aug/26/edit/26edit3&more=2012/aug/26/edit/editpagemain1&date=8/26/2012

ముఖాముఖి

జన్యుమార్పిడి పంటలపై మరిన్ని పరిశోధనలు, సరైన నియంత్రణ వ్యవస్థ లేకుండా ఫీల్డ్ ట్రయల్స్‌కు అనుమతించకూడదని పార్లమెంటరీ స్థాయీ సంఘం చేసిన సిఫార్సులపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జన్యు మార్పిడి పంటలకు సంబంధించిన అంశాలపై పరిశ్రమవర్గాలు చెబుతున్న దానికి, పరిశోధనలలో తేలుతున్న నిజాలకు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జన్యుమార్పిడి పంటలకు సంబంధించిన వాస్తవాలు, భ్రమలపై అధ్యయనం చేస్తున్న ‘సెంటర్ ఫర్ సస్టేయనబుల్ అగ్రికల్చరల్’ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ జి.వి. రామాంజనేయులుతో ఈ వారం ముఖాముఖి..

బీటీ విత్తనాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. కాని పరిశోధనలలో తేలుతున్న నిజాలు వేరే విధంగా ఉంటున్నాయి..?
బీటీ విత్తనాలు కరువు పరిస్థితులను కూడా తట్టుకొని నిలబడతాయని.. దిగుబడి ఎక్కువ వస్తుందని.. ఈ పంటలకు కలుపు మందులు వేయాల్సిన అవసరం లేదని.. పురుగులు ఎక్కువ రావనే ప్రచారం జరుగుతోంది. కాని ఈ ప్రచారం నిజం కాదు. బీటీ విత్తనాల వల్ల దిగుబడి బాగా పెరిగిందనేది పూర్తి అవాస్తవం. ఉదాహరణకు బీటీ పత్తిని తీసుకుందాం.

2001 నుంచి 2005 దాకా మన దేశంలో పత్తి దిగుబడి 78 శాతం పెరిగింది. దీనిలో కేవలం ఆరు శాతం విస్తీర్ణంలో మాత్రమే బీటీ విత్తనాలను వేశారు. ఇదే విధంగా 2006-11 సంవత్సరాల మధ్య చూస్తే- మొత్తం విస్తీర్ణం 80 శాతం పెరిగితే- దానిలో దిగుబడి రెండు శాతం పెరిగింది. ఈ రెండింటి «ఆధారంగా చూస్తే దిగుబడి పెరగటానికి బీటీ విత్తనాలు మాత్రమే కారణం కాదని అర్థమవుతుంది. అదనంగా సాగు కిందకు వచ్చిన భూమి పెరగటం మొదలైన ఇతర కారణాలు చాలా ఉన్నాయి.

వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా బీటీ విత్తనాలు వేసిన ప్రాంతాల్లో దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఇక బీటీ విత్తనాలు పురుగులను తట్టుకుంటాయని చేస్తున్న వాదనలో కూడా నిజం లేదు. పురుగులు బీటీ విత్తనాలను తట్టుకొనే శక్తిని పెంచుకున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ ఉదాహరణనే తీసుకుంటే- గులాబీ రంగు తొలిచే పురుగును బీటీ పత్తి విత్తనాలు తట్టుకోలేకపోతున్నాయని మోన్‌శాంటోనే ప్రకటించింది. ఇదే విధంగా బీటీ విత్తనాలు కాయి తొలిచే పురుగులను కూడా తట్టుకోలేకపోతున్నాయి.

బీటీ పత్తికి సంబంధించి కంపెనీలు గుజరాత్‌ను ఒక రోల్ మోడల్‌గా ప్రచారం చేస్తూ ఉంటాయి. గుజరాత్‌లో నిజంగానే బీటీ పత్తి విజయం సాధించిందా?
గుజరాత్ ప్రభుత్వ నివేదికల ఆధారం చూస్తే పత్తి సాగు చేసే ప్రాంతం దాదాపు 45 శాతం పెరిగింది. అదనంగా సాగులోకి వచ్చిన ప్రాంతం 43 శాతం పెరిగింది. వీటికి తోడుగా హైబ్రీడ్ పత్తి వేసిన ప్రాంతం కూడా పెరిగింది. ఈ కారణాల వల్ల గుజరాత్‌లో దిగుబడి పెరిగింది తప్ప- బీటీ విత్తనాల వల్ల మాత్రమే కాదు. ఇక్కడ మనం ఒక విషయాన్ని తప్పకుండా చెప్పుకోవాలి. చాలా సార్లు జన్యు మార్పిడి పంటల వల్ల కలిగే ప్రయోజనాలను ప్రచారం చేసేవారు- తమ వద్ద ఉన్న సమాచారాన్ని పూర్తిగా అందించరు. తమకు అనుకూలంగా కనిపించే కొంత సమాచారాన్ని ఇస్తారు. దీనిని చూస్తే- అంతా సజావుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కాని ఇది నిజం కాదు.

బీటీ వంకాయ ఫీల్డ్ ట్రయల్స్‌కు సంబంధించి పెద్ద వివాదం నడుస్తోంది కదా. దీని వెనకున్న కథ ఏమిటి?
బీటీ వంకాయ విత్తనాల వల్ల కలిగే దుష్ఫరిమాణాలను జాగ్రత్తగా అధ్యయనం చేయకుండా అనుమతించవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో సహా పది రాష్ట్రాలు బీటీ వంకాయ ఫీల్డ్ ట్రయల్స్‌ను అనుమతించబోమని ప్రకటించాయి. అయితే మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. జన్యు మార్పిడి పంటల వల్ల వచ్చే లాభనష్టాలను సమీక్షించటానికి మన దగ్గర సరైన నియంత్రణా వ్యవస్థ లేదు. ఉదాహరణకు బీటీ పత్తినే తీసుకుందాం. దీని లాభనష్టాలను 2005లో చివరి సారి సమీక్షించారు. ఆ తర్వాత ఎప్పుడూ మళ్లీ సమీక్ష జరగలేదు.

బీటీ పత్తి వల్ల అనేక దుష్ఫరిణామాలు ఏర్పడుతున్నాయని ఈ లోపులో అనేక పరిశోధనలు వచ్చాయి. ఉదాహరణకు వరంగల్ జిల్లాలో బీటీ పత్తి ఆకులు తిని పశువులు మరణించాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. ఇలాంటి వాటిని ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకోవాలి. చాలా సార్లు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోదు. పైగా జన్యుమార్పిడి పంటలపై పరిశోధనలకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించి, తామే పరిశోధనలు చేస్తామని ప్రకటిస్తోంది కూడా. ఈ మొత్తం వ్యవహారం వెనక పెద్ద పెద్ద కంపెనీల లాబీయింగ్ కూడా ఉంటుంది.

మన కన్నా ముందే కొన్ని దేశాలలో జన్యు మార్పిడి పంటల పరిజ్ఞానం ప్రవేశించింది కదా. వారి అనుభవాలేమిటి?
ప్రపంచంలో పన్నెండు దేశాల్లో మాత్రమే జన్యు మార్పిడి పంటలను వేస్తున్నారు. వారి అనుభవాలు కూడా అంత సంతృప్తికరంగా లేవు. అమెరికాలో తాజాగా చేసిన పరిశోధనలలో- ఈ పంటల వల్ల దిగుబడి బాగా తగ్గుతోందని తేలింది. అంతే కాకుండా ఈ పంటలను తట్టుకొనే చీడ పురుగులు తయారయ్యాయి. వీటిని సూపర్ వీడ్స్ అని పిలుస్తున్నారు.

దీనికి తోడు పేటెంట్స్ పేరిట మొత్తం విత్తన మార్కెట్ అంతా కొన్ని కంపెనీల చేతిలోకి వెళ్లిపోతుంది. ఈ ప్రక్రియ మన దేశంలో కూడా ప్రారంభమయింది. ఉదాహరణకు మన దేశంలో బీటీ పత్తి విత్తన మార్కెట్‌లో 98 శాతం మాన్‌శాంటో చేతిలోనే ఉంది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయాన్ని చెబుతాను. బీటీ విత్తనాలకు సంబంధించిన అంశాలలో కంపెనీని ప్రభుత్వం నియంత్రించాలి. కాని పరిస్థితి ఆ విధంగా లేదు. చాలా సార్లు కంపెనీయే ప్రభుత్వంపై కేసులు పెట్టింది.

ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి ఉన్న మార్గాలేమిటి?
ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులపై ప్రభుత్వం శ్రద్ధ చూపించాలి. పరిశోధనలకు నిధులను కేటాయించాలి. పరిశోధనాశాలలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి. వీటిన్నింటితో పాటుగా నియంత్రణ వ్యవస్థను కట్టుదిట్టం చేయాలి. ఈ విత్తనాలకు సంబంధించిన అంశాలలో కొందరిని బాధ్యులను చేయాలి. ప్రస్తుతం ఈ పద్ధతి లేకపోవటం వల్ల ఇటు ప్రభుత్వం కాని, ఈ విత్తనాలను అనుమతించిన రెగ్యులేటర్ కాని, తయారు చేసిన కంపెనీ కాని బాధ్యత తీసుకోవటం లేదు. దీని వల్ల సామాన్య రైతులు నష్టపోతున్నారు.
– ఇంటర్వ్యూ : సి.వి.ఎల్.ఎన్. ప్రసాద్